Friday, August 7, 2026
HomeTelanganaపార్కింగ్ మాయం.. రోడ్డే పార్కింగ్‌గా మారింది..!

పార్కింగ్ మాయం.. రోడ్డే పార్కింగ్‌గా మారింది..!

📰 Generate e-Paper Clip

సెల్లార్‌లలో షాపులు – మార్కెట్ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ కష్టాలు

పార్కింగ్ లేకున్నా అనుమతులు ఎలా..? అధికారుల మౌనంపై ప్రజల ఆగ్రహం

మంచిర్యాల, ఆగస్టు 6, ( ఆంజనేయులు న్యూస్ )

పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర భవనంతో పాటు పలు వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ కోసం కేటాయించాల్సిన సెల్లార్‌లలో మొబైల్ షాపులు, ఇతర వాణిజ్య దుకాణాలు నిర్వహిస్తుండటంతో భవనాలకు వచ్చే వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిపివేయాల్సి వస్తోందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెద్ద వాణిజ్య భవనాలకు తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, పార్కింగ్ కోసం ఉద్దేశించిన సెల్లార్‌లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “పార్కింగ్ సౌకర్యం లేకపోయినా ఈ భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారు? నిబంధనలు ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, శ్రీ వెంకటేశ్వర భవనం మాత్రమే కాకుండా మార్కెట్ ఏరియాలోని పలు కాంప్లెక్స్‌ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెబుతున్నారు. సెల్లార్‌లను అద్దెకు ఇచ్చి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో భవన యజమానులు ఆదాయం పొందుతుండగా, ప్రజలు మాత్రం ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ఏరియాలో రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నా మున్సిపల్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ ఏరియాలోని అన్ని వాణిజ్య సముదాయాలను తనిఖీ చేసి, సెల్లార్‌లను పార్కింగ్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.