Monday, August 17, 2026
HomeTelanganaరోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ పై పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై తక్కువ ఎత్తు గల బీమ్‌లు, తక్కువ విజిబిలిటీ ఉన్న చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లపై అదుపు తప్పిన, ఓవర్ లోడెడ్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు సెల్లార్ స్థలాలు కేవలం పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు రహదారుల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కేజ్ వీల్స్, ట్రాక్టర్ కేజ్ వీల్స్ వినియోగాన్ని నిలిపి వేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచనలు ఏర్పాటు చేయాలని సూచించారు. కూరగాయల వ్యాపారులు రోడ్లపై విక్రయాలు చేయకుండా ప్రత్యేక మార్కెట్ స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి మండల, గ్రామాల పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు, డ్రైవర్లు, ప్రజలను రోడ్డు భద్రత నియమాలపై చైతన్య పరచాలని తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ దిశగా జాగ్రత్త సూచికలు, బోర్డులు, వేగనిరోధకాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, కల్వర్టుల వద్ద షోల్డర్స్, రేడియంతో సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారులపై సంచరించే పశువులను గోశాలలకు తరలించేందుకు మున్సిపల్ అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

డి.సి.పి. భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చలికాలం అయినందున పొగ మంచు దృష్ట్యా వాహనదారులు నిర్ణీత వేగంలో వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని తెలిపారు. రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో “అరైవ్ – అలైవ్” నినాదంతో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.