Monday, August 17, 2026
HomeCrimeకాసులే లక్ష్యం.. కడుపుకోతలే అధికం

కాసులే లక్ష్యం.. కడుపుకోతలే అధికం

📰 Generate e-Paper Clip

జిల్లాలో ప్రవేట్ ప్రసూతి హాస్పిటల్లో ఇష్ట రాజ్యం

రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు.

• జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరలోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 633 ప్రసవాలు జరగగా 19 మాత్రమే సాధారణ కాన్పులు మిగతావి శాస్త్ర చికిత్స కాన్పులే.

ఐబీ దగ్గరలోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో ఏడాది కాలంలో 464 ప్రసవాలు జరిగితే 65 సాధారణంకాగా మిగతా 399 శస్త్రచికిత్స కాన్పులే.

• బెల్లంపల్లి చౌరస్తా నుంచి ప్రయాణ ప్రాంగణం వెళ్లే దారిలోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో సంవత్సర కాలంలో 488 ప్రసవాలు జరిగితే 45 సాధారణంకాగా 443 శస్త్రచికిత్సలే. మొదట సాధారణ ప్రసవమని చెబుతూ సమయానికి ఏదో కారణంతో శస్త్రచికిత్స చేయాలంటూ భయపెడతారనే ఆరోపణలు ఉన్నాయి.

• బెల్లంపల్లి చౌరస్తాలోని మరో ఆసుపత్రిలోనూ ఏడాదిలో 448 ప్రసవాలు జరిగితే 52 మాత్రమే సాధారణం. మిగితా 396 కోతలే.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పలు ప్రసూతి ఆసుపత్రులు కాసుల కోసం ‘కడుపుకోత’లకు పోటీపడుతున్నాయి. ఆరోగ్యశాఖ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినా, మెమోలిచ్చి హెచ్చరిస్తున్నా ఏ మాత్రం మార్పు రావడం లేదు. బాధితుల ఒత్తిడి, పరిస్థితి తీవ్రత మేరకు శస్త్రచికిత్సలకు మొగ్గు చూపిస్తున్నామని చెబుతున్నారు. వీటిపై చర్యలు మరింత కఠినతరం చేయడం, సర్కారు కేంద్రాలను మరింత బలోపేతం చేస్తేనే కోతలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్యాకేజీ మాదిరి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు.

• సర్కారులో అలా.. ప్రైవేటులో ఇలా

జిల్లాలోని ప్రసూతి ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. సర్కారులో సాధారణ ప్రసవానికి మొగ్గు చూపే వీరే ప్రైవేటులో శస్త్ర చికిత్సలకు మొగ్గు చూపడం గమనార్హం. గర్భిణులకు అవగాహన కల్పించాల్సిందిపోయి కోతలే నయమన్నట్లు వ్యవహరించడం ఇబ్బందికరంగా మారుతోంది. వీటివల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తెలపడం లేదు.

• మెరుగైన సేవలతోనే సాధ్యం

ప్రైవేటు కంటే సర్కారులో మెరుగైన సేవలతో ఈ పరిస్థితిని కట్టడి చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాలను ప్రసూతి సేవలపరంగా బలోపేతం చేసి సరిపడా వైద్యుల నియామకం చేపడితే ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ప్రైవేటుబాట పట్టకుండా చూస్తే ఈ పరిస్థితి నివారించవచ్చంటున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.