ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించి నాణ్యమైన మార్కులు సాధించే దిశగా సన్నద్దం చేయాలని, పాఠ్యాంశాలలోని ప్రతి అంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. విద్యార్థులు మార్కుల వెంట కాకుండా మార్కులే విద్యార్థుల వెంట వచ్చేలా విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దాలని తెలిపారు. నేర్చుకున్న చదువును, జ్ఞానాన్ని తమ నిత్య జీవితానికి అన్వయించకొని నైతిక విలువలు పాటిస్తూ ఎదిగేలా ప్రతి విద్యార్థిని సిద్ధం చేయాలని తెలిపారు. పాఠశాలలను తమ సొంత ఇల్లు అనే భావన విద్యార్థులలో కలిగించి పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని, పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళలలో నిర్వహించే ప్రత్యేక రివిజన్ తరగతులను పర్యవేక్షించేందుకు మండలాల వారిగా కమిటీల నియామకం జరిగిందని, ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు, డిసెంబర్ 2, 3 తేదీలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాలు తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
