హైదరాబాద్: నగరంలోని నాచారం పీఎస్ పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. కారు రివర్స్ తీస్తుండగా కారు కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాచారం పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న యువతిని ఎక్కించుకోవడానికి ఓలా క్యాబ్ వచ్చింది. యువతి కారులో ఎక్కిన తర్వాత క్యాబ్ డ్రైవర్ రివర్స్ తీసుకున్నాడు. అదే సమయంలో వాహనం వెనక చిన్నారి ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ కారును అలాగే వెనక్కి తీసుకెళ్లాడు. వెనక టైరు కింద పడిన చిన్నారి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. వెనకాల ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకొని పాపను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
చిన్నారి తల్లి రవళి వాచ్ మెన్ గా పనిచేస్తుండగా.. తండ్రి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కన్న కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు..