తిరుమల: తిరుమలలో అష్టదళపాదపద్మారాధన సేవలను పునరుద్ధరించారు. తిరుప్పావడ సేవా టికెట్లు ఉన్న వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ 30 వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ ప్రకటనకు ముందే ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. దీంతో ఈ సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది.
అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30 వరకు సేవా టికెట్లు పొందిన వారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని.. లేని పక్షంలో సేవా టికెట్ రీఫండ్ పొందాలని తితిదే భక్తులను కోరింది..