మానవతా సేవలో డాక్టర్ ములుకాల కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి సమయంలో మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ నిస్సహాయ స్థితిలో తిరుగుతూ కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కాగజ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ సందీప్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విషయాన్ని సీఐ కుమారస్వామికి తెలియజేశారు.
సీఐ కుమారస్వామి స్పందించి ఆసిఫాబాద్ సఖి కేంద్రం కౌన్సిలర్ సుమలతకు సమాచారం అందించగా, ఆమె సహకారంతో ఆ మహిళను అర్ధరాత్రే సఖి కేంద్రానికి తరలించారు. సోమవారం ఉదయం ఎస్‌ఐ సందీప్ కుమార్ దహేగాం ఎస్‌ఐ విక్రమ్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కల్వరి కుమార్ అలియాస్ డాక్టర్ ములుకాల కుమార్‌తో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. మహిళ పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ములుకాల కుమార్ ఆమెను ఆశ్రమంలో చేర్చుకోవడానికి అంగీకరించారు.
తదనంతరం సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్, ఏఎస్‌ఐ రాము కలిసి ఆ మహిళను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమానికి పంపించి ఆశ్రయం కల్పించారు.
తమ అనేవారి ఆదరణ కోల్పోయి రైల్వే స్టేషన్ వద్ద అనాధగా తిరుగుతూ దుర్భర జీవితం గడుపుతున్న ఆ మహిళను కన్నతండ్రిలా ఆదరించి ఆశ్రయం కల్పించిన డాక్టర్ ములుకాల కుమార్ మానవతా సేవను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ సుచరిత, పారా మెడికల్ హారిక తదితరులు పాల్గొన్నారు.


