మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వేసవికాలం అయినందున వడగాలులతో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జిల్లాలో వడదెబ్బ నియంత్రణపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి, రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా అధికారులతో కలిసి అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బ నియంత్రణ, నివారణ పద్దతులపై పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, వడదెబ్బకు గురైన వారు పాటించవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బ బాధితులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. వడదెబ్బ నుండి రక్షించుకునేందుకు సరిపడా నీటిని త్రాగాలని, సూర్యరశ్మి నేరుగా పడకుండా గొడుగులు, టోపీలు, కళ్ళజోళ్ళు ధరించాలని, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని, ఎండ తీవ్రత అధికంగా కలిగిన మధ్యాహ్నం 12 గం||ల నుండి సాయంత్రం 3 గం||ల మధ్య నీడ ప్రదేశాలలో ఉండాలని, ఎండలో పని చేయడం, ఆటలు ఆడటం, ఎండలో నిలిపి ఉంచిన వాహనాలలో ఉండటం, మద్యం, టీ, కాఫీ, చల్లని పానీయాలు ఇతర హాని కలిగించే ద్రవ, ఘన పదార్థాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా బయట నడవటం వంటివి చేయకూడదని ప్రజలందరికీ తెలిసేలా వివరించాలని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన పరిధిలోని గ్రామాలలో వడదెబ్బపై అవగాహన కల్పించడం బాధ్యతగా తీసుకోవాలని, దాహం వేసినా, వేయకపోయినా సమయానుసారంగా నీటిని త్రాగాలని, పనికి వెళ్ళినప్పుడు, ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా నీటిని వెంట తీసుకువెళ్ళానని, సన్నని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలని, ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళలలో పనులు చేసుకోవాలని, గర్భిణులు, వయోవృద్ధులు, చిన్నపిల్లలు ఎండలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధిక మాంసకృత్తులు కలిగిన, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదని తెలిపారు. వడదెబ్బను నియంత్రించడంలో ఓ. ఆర్.ఎస్. ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వడదెబ్బ బాధితులకు ఓ. ఆర్.ఎస్. వెంటనే అందించాలని, అశా కార్యకర్తల వద్ద ఉన్న ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లను వినియోగించుకోవాలని, ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో లేని పక్షంలో 1 లీటర్ నీటిలో 1 చెంచా ఉప్పు, 2 చెంచాల చక్కెర కలిపిన ద్రావణాన్ని త్రాగించాలని, అందుబాటులో ఉన్నట్లయితే కొబ్బరిబొండాలు త్రాగించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కలిగిన బాధితులను నీడ ఉన్న చల్లని ప్రదేశానికి వెంటనే తరలించాలని, బాధితుడి చుట్టు గుంపులుగా ఉండకుండా గాలి ఆడేలా చూడాలని, తడిగుడ్డతో శరీరమంతా తుడవాలని, 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. మాతా శిశు కేంద్రంలో వడదెబ్బ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు 5 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని, ప్రతి అశా కార్యకర్త వద్ద ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య-ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల ప్రదేశాలలో ఉపాధి కూలీలకు నీడ, త్రాగునీరు, ఓ. ఆర్.ఎస్., మెడికల్ కిట్లు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అనంతరం అధిక ఉష్ణోగ్రత వలన మానవ శరీరంలో వచ్చే వ్యాధుల నియంత్రణ సంబంధిత గోడప్రతులు, కరపత్రాలను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి, సి, సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, ప్రోగ్రాం అధికారి డా|| విజయపూర్ణిమ, వైద్యాధికారులు డా|| ఫయాజ్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రరెడ్డి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, జిల్లాలోని సూపర్వైజర్లు, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.