
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను అన్ని జిల్లాలలో ఈ నెల 16, 17, 18 తేదీలలో పండుగలా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. 16న ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ రూట్ మ్యాప్ తయారు చేయాలని, నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 వేల మందితో భారీ ర్యాలీ, సమావేశం నిర్వహించాలని, భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 17న జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ భవన్ బంజారా భవన్ ప్రారంభానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యాల మేరకు షెడ్యూల్డ్ తెగల ప్రజాప్రతినిధులు, ప్రజలను తరలించాలని, రవాణా కొరకు బస్సులు, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ నెల 18న జిల్లా కేంద్రాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రముఖ కళాకారులు, స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు త్రివర్ణ రంగులలో విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ…
జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా గోడప్రతుల ద్వారా విస్తృత ప్రచారం కొరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, హైదరాబాద్ కు షెడ్యూల్డ్ తెగల వారిని తరలించేందుకు రవాణా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

