చిత్తూరు జిల్లా: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరిన పోలీసు వాహనం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. కారు బోల్తాపడి బెంగళూరు శివాజీనగర ఎస్సై అవినాష్ (29), కానిస్టేబుల్ అనిల్ మల్లిక్ (26), డ్రైవర్ మ్యాక్స్వెల్ (32) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రొబేషనరీ ఎస్సై దీక్షిత్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే బ్రిడ్జి ఎత్తు తెలపడానికి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఇనుపస్తంభాన్ని తప్పించబోయి అక్కడే ఉన్న మరో బ్రిడ్జిని ఢీకొని కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరు సీఎంసీకి తరలించారు.
కారులో ఇరుక్కున్న మృతదేహాలను జేసీబీతో వెలికితీశారు. ఎస్సై అవినాశ్ బీదర్ జిల్లా బసవకళ్యాణ తాలూకా దాసరవాడి నివాసి. ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. కానిస్టేబుల్ అనిల్ మల్లిక్ బాగలకోట్ జిల్లా జమఖండి తాలూకా చిక్కళ కెరె వాసి. మ్యాక్స్వెల్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. 8 మంది పోలీసులు రెండు కార్లలో ప్రయాణిస్తుండగా… అందులో ఒకటి ప్రమాదానికి గురైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వేలూరు ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను బెంగళూరుకు తరలించాలని అధికారులను ఆదేశించారు