Telugu Updates
Logo
Natyam ad

ఇకపై భక్తులు సలేశ్వర క్షేత్రానికి రావొద్దు..?

సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి నిరాకరణ

నాగకర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. వర్షం వల్ల సలేశ్వర క్షేత్రంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండల పైనుంచి గుండంలోకి రాళ్లు జారిపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో సలేశ్వర క్షేత్రానికి వెళ్లే మార్గమంతా బురదమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకపై భక్తులు సలేశ్వర క్షేత్రానికి రావొద్దని అధికారులు సూచించారు. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సలేశ్వరం ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి..

సలేశ్వర ప్రత్యేకత ఏమిటంటే..?

ఎత్తయిన కొండ నుంచి జాలువారే జలపాతం, కొండలోని గుహలో కొలువుదీరిన లింగమయ్య.. ఇవన్నీ అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలోని సలేశ్వర క్షేత్ర సందర్శనకు వస్తే కనిపిస్తాయి. ఈ యాత్రను తెలంగాణ అమర్నాథ్ యాత్రగా భక్తులు అభివర్ణిస్తారు. జనావాస ప్రాంతానికి 25 కి.మీల దూరంలో దట్టమైన కీకారణ్యంలోని సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య స్వామి ప్రత్యేక ఉత్సవాలు ఏటా చైత్ర పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఇక్కడి చెంచులే పూజారులుగా ఉండి లింగమయ్యకు పూజలు నిర్వహిస్తారు..

స్వామిని వారిని దర్శించుకోవాలంటే ఏటవాలుగా ఉన్న కొండల మధ్య నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గమంతా దుర్భేద్యంగా ఉంటుంది. మోకాళ్ల కురువ నుంచి 6 కిలో మీటర్లు రాళ్లు తేలిన దారిపై కొండలు దిగుతూ లింగమయ్య దర్శనానికి వెళ్తారు. అలాగే ఫర్హాబాద్ నుంచి రాంపూర్ పెంట మీదుగా, మరోవైపు లింగాల మండలం అప్పాయపల్లి నుంచి గిరిజన గుండాల దారి గుండా భక్తులు సలేశ్వర క్షేత్రానికి చేరుకుంటారు..