రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, రవాణా, విద్యా శాఖల అధికారులు, ఆర్.టి.సి. అధికారులతో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ..
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్) లను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, అంబులెన్స్, ఆసుపత్రులు, రహదారులకు లింకేజ్ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తెలుసుకొని ఉండాలని, మండల, జిల్లా కేంద్రాలలో విద్యార్థులతో ర్యాలీ, రంగోలి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలను విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని, రోడ్డు భద్రతా నియమాలను ఒకసారి కంటే ఎక్కువగా ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో తిరిగి లైసెన్స్ జారీకి వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలపై సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత ప్రచారం కల్పించాలని, ఎంపిక చేయబడిన పాఠశాలల్లో ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమ, నిబంధనల పుస్తకాలను స్థానిక భాషలోకి అనువదించి జిల్లా అధికారిక వెబ్సైట్లలో నమోదు చేయాలని, మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో చురుగ్గా పని చేసిన వారిని గుర్తించి జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జ్ఞాపికలు అందించి ప్రోత్సహించాలని, విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ. రహదారి భద్రత మాసోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని, మూలమలుపులు, వేగనిరోధకాలు, వేగ పరిమితి, యు టర్న్, ఇతర సూచికలను ఏర్పాటు చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారుల మరమ్మత్తులు జరిగే ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రమాదాల నియంత్రణలో భాగంగా విస్తృతస్థాయి తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, విద్యార్థులతో ర్యాలీలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర వాహనచోదకులు సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.సి.పి. ప్రకాష్, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్కుమార్, రోడ్లు-భవనాల శాఖ అధికారి రాము, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్, ఎక్సైజ్ సి.ఐ., మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.