Telugu Updates
Logo
Natyam ad

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడకు చెందిన మటూరి కమల తనకు క్యాతన్ పల్లి శివారులో గల భూమిని ఆక్రమించుకొని అక్రమంగా చేసుకున్న మార్పిడి రద్దు చేసి గౌరవ న్యాయస్థానం తీర్పు ప్రకారం తన పేరిట పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం అమరవాదికి చెందిన నంది తిరుపతి తన దరఖాస్తులో తన తండ్రి పేరిట గల భూమిని తమ పేరిట విరాసత్ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నెన్నెల మండలం కోనంపేట గ్రామస్తులు పుప్పాలవానిపేట శివారులో గల తమ భూములలో సి.ఎం. గిరి వికాసం పథకం క్రింద విద్యుత్ సౌకర్యంతో కూడి బోర్ మంజూరై బోర్ త్రవ్వకం పూర్తి అయిందని, తమ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమిని మండల కేంద్రానికి చెందిన నాయిని చిన్నక్క తనకు మండలంలోని కమలాపూర్ శివారులో పట్టా భూమి ఉందని, ఇట్టి భూమి ఆన్లైన్లో బ్లాక్ లిస్టులో ఉందని, తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. చెన్నూర్ మండలం సోమన్పల్లి గ్రామానికి చెందిన సిద్ది రాజయ్య తనకు గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ఇట్టి భూమి వివరాలను ధరణిలో నమోదు చేసి పట్టా పాస్పుస్తకం మంజూరు చేయగలరని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఆరెగూడ గ్రామానికి చెందిన శీలం సత్యనారాయణ తనకు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి శివారులో తన తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమి ఉందని, ఇట్టి భూమి కొందరు ఆక్రమించుకొని అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఈ పట్టాను రద్దు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.