హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని పౌరసరఫరాల భవన్ లో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, గన్నీ సంచులు, రవాణా, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దని, ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. రైతులు పుకార్లు నమ్మెద్దని అన్నారు. రవాణాలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత ఒక్క గింజ కూడా తరుగు పెట్టొద్దని, అలాంటి ఘటనలు దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఇప్పటి వరకూ రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని, రాజకీయ నిరుద్యోగులే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల విమర్శించారు.