పనిచేయని మంచినీటి పథకాలు
వాగులు చెలిమల నీళ్లే దిక్కు
గుక్కెడు నీటి కోసం తహతహలాడిపోతున్న గిరిజన గ్రామాలు

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాలలో గుక్కెడు నీటి కోసం తహతహలాడిపోతున్నారు. వాగులు ,వంకలు, చెలిమల నీళ్లే వారికి మంచి నీటి శుద్ధ పథకాలు. ప్రతి ఏడాది ఎండాకాలంలో గిరిజన గ్రామాలు తాగునీటి కోసం తహతహ లాడాల్సిందే. మిషన్ భగీరథ పథకాలు, చేతిపంపులు ఉన్న అవి సక్రమంగా పనిచేయకపోవడంతో ఆయా గ్రామాలప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. జిల్లాలో 1175 లోని హ్యాబిటేషన్లో 4515 మొత్తం చేతిపంపులు ఉండగా 105 వరకు సీజనల్ పంపులు ఉన్నాయి. అదేవిధంగా ఒక వెయ్యి 28 సింగిల్ ఫేస్ ద్వారా నడిచే పంపులు ఉండగా నాలుగు సీజనల్ పంపుసెట్లు ఉన్నాయి. 126 పిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉండగా, 1056 బావులు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం జిల్లాలోని జోడేఘాట్ పోరుగడ్డ గ్రామాలు తాగు నీటి కోసం తహతహ లాడిపోతున్నాయి. పోరుగడ్డ పైన ఇంకా తాగునీటి సమస్య గిరిజనులను వెంటాడుతూనే ఉంది. మిషన్ భగీరథ పథకాలు ఉన్న గుట్టపైన సక్రమంగా పనిచేయలేని పరిస్థితి కెరమెరి మండలంలోని పోరు గ్రామాలైన భాబేజరి, చిన్న పాట్నాపూర్, జోడేఘాట్, శివగుడా, పాటగూడ, చాల్ బడి, లైన్ పటార్, కల్లేగాం, పిట్టగూడా, గ్రామాలలో ఉన్న చేతి పంపులు సరిపోవడం లేదు. శివగూడా గ్రామస్తులయితే చెలిమల నీటిపైనే ఆధార పడాల్సిన పరిస్థితి. ఎక్కడో ఒక చోట ఉన్న బావి దగ్గరికి ఉదయాన్నే పరుగో, పరుగు అంటూ తాగు నీటిని బిందెలల్లో తీసుకొని కాలినడకన గ్రామాలకు చేరుకుంటారు. అదేవిధంగా తిర్యానీ మండలంలోని మంగి, గుండాల, కేరగడ, గీసుగూడ, భీమ్ రాల, గ్రామాలు సైతం తాగునీటి కోసం పరేషాన్ అవుతున్నాయి. ఆయా గ్రామాలలో మిషన్ భగీరథ పథకాలు ఉన్న కొన్ని పని చేసిన మిగతావి ఉత్సవ విగ్రహాల్లాగా దర్శనమిస్తున్నాయి. ఇదే మండలంలోని భీమ్ రాల గ్రామస్తులు ఎడ్ల బండ్ల పైన ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని తాగు నీటిని తీసుకొని వచ్చి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ, సమతులగుండం, పాడిబండ, మందేపల్లి గ్రామాలలో సైతం చేతి పంపులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామనివారు పేర్కొంటున్నారు. ఇంతే కాకుండా జిల్లాలోని జై నూర్, లింగాపూర్, రెబ్బెన తదితర మండలాలలోని మారుమూల గ్రామాలలో ఇంకా సరిపడా చేతి పంపులు లేక, కొన్నిచోట్ల మిషన్ భగీరథ పథకం పనిచేయక, మరికొన్నిచోట్ల పైప్లైన్లు సక్రమంగా పనిచేయక ప్రతి ఏడాది వేసవి కాలంలో వారు తాగునీటికి తిప్పలు పడుతున్నారు.
• ఒకరోజు వస్తే ఒకరోజు రావు..
ఆత్రం భీంభాయి (మందే పెళ్లి గ్రామం)
మా గ్రామంలో 18 నుండి 20 కుటుంబాలు ఉన్నాయి. చేతి పంపులు సరిపడా లేక తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం
• మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయ్.
మడావి గోవింద్ (సిరియన్ మోవాడ్ గ్రామం)
మా గ్రామంలో రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. మా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకు ఉంది కానీ సక్రమంగా పనిచేయదు. అధికారులు ఇంకా చేతిపంపులను ఏర్పాటు చేయాలి.
• చేతిపంపులను ఏర్పాటు చేయాలి..
లవకుస్ (మోవాడ్ గ్రామం)
మా గ్రామంలో మంచినీటి పథకం, చేతి పంపులు ఉన్న అవి సరిపోవడం లేదు.ఎండాకాలంలో తాగునీటికి గోస అయితది. అధికారులు పట్టించుకోవాలి.
• తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం..!
సిద్ధికి మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
జిల్లాలోని 147 వల్ నరబుల్ హ్యాబిటేషన్స్ లలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండే విధంగా ఉంది. ఆయా గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం..

