మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోవు 2, 3 రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో టాం-టాం ద్వారా అప్రమత్తత చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అధికారులు హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్ళరాదని, ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా సంభవించే పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షపాతాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరం మేరకు ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు సహాయం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నం. 08736-250501లో సంప్రదించవచ్చని, 24 గంటలు కంట్రోల్ రూమ్ పని చేస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు.