
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో స్టాంప్ వెండర్ల వద్ద 5 ప్రాంకింగ్ మిషన్లు ఉన్నాయి. వీరు బాండ్ కాగితానికి బదులు తెల్లపేపరుపై ఎంత విలువైన స్టాంప్ కావాలో అంత ఫ్రాంకింగ్ మిషన్ తో ముద్రించి ఇస్తారు. ఇలా ముద్రించినందుకు స్టాంప్ వెండర్ కు ప్రభుత్వం దాని విలువపై 2.2 శాతం కమీషన్ ఇస్తుంది. వీరు 10 నుంచి 20 శాతం డబ్బులు అధికంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాంకింగ్ మిషన్ ఉన్నా వినియోగించకుండా స్టాంప్ వేండర్లకు లాభం చేకుర్చేలా వారి వద్దకే పంపిస్తున్నారని ఆరోపణలున్నాయి. స్టాంప్ విక్రేతలు బాండ్ కాగితాలను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నా చర్యలు తీసుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ అధికారులు మామూలుగా తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 57 మంది లైసెన్స్ పొందిన స్టాంప్ వెండర్లు ఉన్నారు. వీరు రెండేళ్లకోసారి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్దేశిత రుసుము చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ఇక్కడ ఎక్కువగా రూ.20, రూ.50. రూ.100 విలువైన బాండ్ కాగితాలు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం వారికి ఒక్కో బాండ్ కాగితానికి 5 శాతం కమీషన్ ఇస్తుంది. వెండర్లు ప్రజల నుంచి అదనంగా రూ.20 నుంచి రూ.30 వసూలు చేస్తున్నారు. ఫ్రాంకింగ్ చేసుకున్న స్టాంప్ కాగితాలకు కూడా ఎక్కువ ధర తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, దస్తావేజు లేఖరులు కూడా బినామీ పేర్లతో స్టాంప్ వెండర్ లైసెన్స్ లు తీసుకొని అక్రమంగా బాండ్ కాగితాలు అమ్మకాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో స్టాంప్ వెండర్లు ఏడాదికి రూ.50 లక్షల విలువైన బాండ్ కాగితాలు, ఫ్రాంకింగ్ ముద్ర ద్వారా రూ.70 లక్షలకు పైచిలుకు స్టాంప్ కాగితాలను అమ్ముతున్నట్టు తెలిసింది. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 38 మంది స్టాంప్ వెండర్లు ఉండగా, లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 9 మంది ఉన్నారు. వెండర్లు ఆ స్టాంప్ కాగితం ఎంత విలువ ఉంటే అదే ధరకు అమ్మాల్సి ఉండగా, రూ.100 స్టాంప్ కాగితానికి అక్రమంగా రూ.30 వసూలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే లైసెన్స్ లు రద్దు చేస్తాం:
ప్రియాంక, సబ్ రిజిస్ట్రార్, మంచిర్యాల
స్టాంప్ వెండర్లు బాండ్ కాగితాలపై ఎంత విలువ ఉంటే అంతకే అమ్మాలి. ఎక్కువ ధరకు అమ్మితే విచారణ చేసి వారి లైసెన్స్ ను రద్దు చేస్తాం. ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి బాండ్ కాగితాలు, ఫ్రాంకింగ్ చేసుకునేవారు ఎంత విలువైన స్టాంప్ కు అంతే డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు..

