
ఆసుపత్రి ముందు పసికందు మృతదేహంతో భైఠాయించిన కుటుంబ సభ్యుల
ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణమందిర్ రోడ్డులో ఉన్న నిత్య పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఐబీ ప్రాంతంలోని కొత్త గుడిసెల ప్రాంతానికి చెందిన కళావతి, జైకిషన్ దంపతుల మూడు నెలల పసికందు అనారోగ్యం బారిన పడటంతో నిత్య పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబు జలుబుతో బాధపడుతున్నాడని వైద్యుడు శ్రీకాంత్రెడ్డి, సిబ్బంది కలిసి నోటి ద్వారా ట్యూబ్ బేసి నంజు తీశారని తెలిపారు. బాబు ఏడ్చి అనంతరం కదలికలు లేకుండా అయ్యారని చెప్పారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు మంచిర్యాలకు వెళ్లమని సూచించారు. వెంటనే పసికందును తీసుకుని మంచిర్యాలకు, అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాబు చనిపోయి కొన్ని గంటలైందని చెప్పడంతో వారు బోరున విలపిస్తు బెల్లంపల్లికి చేరుకున్నారు. ఆసుపత్రి ముందు పసికందు శవంతో బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటికే ఆసుపత్రికి తాళం వేసి వైద్యుడు, సిబ్బంది వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల వరకు పసికందు మృతదేహంతో వారు దారిపైనే భైఠాయించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శంకరయ్య, ఎస్సై విక్టర్, ఏఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని వారు సమీక్షించారు. వైద్యుడు వచ్చి సమాధానం చెప్పే వరకు తాము ఇక్కడే ఉంటామని బాధితులు తెలిపారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..

