జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒడ్డే ఓబన్న 218 వ జయంతి కార్యక్రమంలో పాల్గొని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నేరటి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఒడ్డే ఓబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో రేనాడు ప్రాంతంలో 1816 సంవత్సరం జనవరి 11వ తేదీన జన్మించి, 18 వ శతాబ్దంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా సంచార జాతులకు నాయకత్వం వహించాడని, గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాడాడని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలను ఎదుర్కొని తన జాతులను కాపాడుకున్న మహనీయుడు అని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..