వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో సాక్షాత్తు బ్యాంక్ అధికారుల సమక్షంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం కలిగించింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం రేణిగూడ గ్రామానికి చెందిన జాదవ్ దేవరావు 2019 లో భూమి తనఖా పెట్టి రూ. 3.40 లక్షల పంట రుణాన్ని తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వచ్చినా గత రెండు మాసాలుగా వడ్డీ కట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు ఆయనపై ఒత్తిడి చేసారని పేర్కొన్నారు. ఒత్తిడి తట్టుకోలేక శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తెచ్చుకుని బ్యాంకు ఆ ఆవరణలోనే తాగాడు. కొద్ది సేపటికి సెక్యూరిటీ సిబ్బంది గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం తెలిపాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై 108 లో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అతను అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. కేవలం బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి తోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.