మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి పరిధిలో ఉన్న పెద్దపల్లి అభ్యర్థిని సైతం ప్రకటించని బీజేపీ
ప్రధాని పర్యటన తర్వాతే అభ్యర్థుల ప్రకటన
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ(భాజపా) మళ్లీ టిక్కెట్లు ప్రకటించింది. ఆ జాబితాలో మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా బాపురావు గెలిచిన తర్వాత భాజపా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఎన్నికల అనంతరం నేతల మధ్య పొడచూపిన విభేదాలతో ఎవరిదారి వారిదన్నట్లు మారింది. శనివారం ప్రకటించిన తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ఇదే ప్రధాన కారణమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి పరిధిలో ఉన్న పెద్దపల్లి అభ్యర్థిని సైతం ప్రకటించలేదు. ఆదిలాబాద్ అభ్యర్థిగా సోయం బాపురావు పేరు ప్రకటించకపోవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సిర్పూర్(టి) నియోజకవర్గాన్ని మినహాయిస్తే ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నేతల వ్యవహారశైలి ఇప్పటికే రాష్ట్ర, జాతీయ అధిష్ఠానాల దృష్టికి వెళ్లింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల పార్టీ అంతర్గతంగా సమీక్ష సైతం నిర్వహించింది. సీనియర్ నేతలు, క్రియాశీలక కార్యకర్తల అభిప్రాయాలను సైతం లెక్క చేయకపోవడం మంచిపరిణామం కాదని అధిష్ఠానం సూచించింది. శాసనసభ ఎన్నికలు జరిగి మూడునెలల వ్యవధిలోనే నేతల మధ్య గ్రూపు విభేదాలు పొడచూపడాన్ని అధిష్ఠానం ఆచితూచి పరిశీలిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్లుగానే ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మరోసారి వశం చేసుకోవడాన్ని భాజపా జాతీయ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ తీసుకునే నిర్ణయమే అంతిమమనే సంకేతం ఇస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్న ఆశావహులను కాకుండా ఇతర పార్టీ నేతలకు టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తుండటం కమలదళంలో కలకలం రేకెత్తిస్తోంది. సిట్టింగ్లకే మళ్లీ టికెట్లని ఇదివరకే తప్పించి భారాసకు చెందిన ఓ నేతకు టికెట్ ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే పావులు కదిపితే, ఎన్నికల ముందు పార్టీలో చేరిన మరో నాయకుడికి టికెట్ ఇప్పించేలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలు చేయడం విభేదాలకు దారితీసింది. దీంతో ఇవి మరింత తీవ్రతరం కాకుండా ఉండేలా టిఫిన్-చాయ్ పేరిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల పంచాయితీ నిర్వహించేదాకా వెళ్లింది. పార్టీ అత్యంత పటిష్ఠంగా ఉన్న ఏ-ప్లస్ స్థానంగా భావిస్తున్న ఆదిలాబాద్ టికెట్ని ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలే పట్టుపట్టడం రాష్ట్ర నాయకత్వాన్ని అంతర్మథనానికి గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుందనుకుంటే నేతలందరినీ ఏకతాటిపై నడిపించే సమర్థ నాయకత్వం కొరవడింది. అందుకే ప్రస్తుతానికి ఆదిలాబాద్, పెద్దపల్లి అభ్యర్థులను ప్రకటించడంలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించాల్సి వ్యవహరిస్తోందనేది కీలకనేతల అభిప్రాయంగా వినిపిస్తోంది.
• ప్రధాని పర్యటనే కీలకం.
ప్రధాని నరేంద్ర మోదీకి ఈ నెల 4న ఆదిలాబాద్ పర్యటన కీలకం కానుంది. ఆదిలాబాద్ స్థానానికి 42 దరఖాస్తులు రాగా అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎస్టీ రిజర్వు స్థానమైనందున ఆదివాసీ, లంబాడాల్లో ఏ తెగకు కేటాయిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. తొలుత నేతల మధ్య విభేదాలను తొలగించడం, పార్టీ ప్రాధామ్యాలను వివరించడానికి పార్టీ ప్రాధాన్యమిస్తోంది. మోదీ పర్యటన తర్వాత అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆదిలాబాద్, పెద్దపల్లి అభ్యర్థులను ప్రకటించాలనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది.