Telugu Updates
Logo
Natyam ad

ప్రశ్నపత్రంలో గందరగోళం.. స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రోజుకో లోపం బయటపడుతోంది. ఇవాళ రెండో సంవత్సరం రాజనీతి శాస్త్రం (సివిక్స్) ప్రశ్నపత్రంలో గందరగోళం తలెత్తింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రాల్లో ఎనిమిదో ప్రశ్న వేర్వేరుగా ఇచ్చారు. రెండు మాధ్యమాల్లో ఒకే ప్రశ్నకు బదులుగా వేర్వేరుగా ఇవ్వడం అయోమయానికి దారి తీసింది. వేర్వేరు ప్రశ్నలు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తెలుగు, ఆంగ్ల మాధ్యమం జవాబు పత్రాలకు వేర్వేరు మూల్యాంకన విధానాలు రూపొందించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. తెలుగు మాధ్యమం విద్యార్థులు తెలుగు లేదా ఆంగ్ల ప్రశ్నకు సమాధానం రాసినా మార్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షల్లో ఇవాళ అత్యధికంగా 12 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 21,876 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.