మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ లో వార్డు కౌన్సిలర్ బానోతు రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి సమయంలో రవినాయక్ ఒంటరిగా ఉన్నాడు. దాడి చేసిన అనంతరం దుండగులు పరార్ అయ్యారు. స్థానికులు రవినాయక్ ను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రవినాయక్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. రవినాయక్ మృతదేహాన్ని ప్రస్తుతం పోస్టుమార్టంకు తరలించారు. తనకు ప్రాణహాని ఉందని కూడా స్వయంగా కొంతమంది తన సన్నిహితులతో రవినాయక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే రవినాయక్ హత్యకు గురికావడం గమనార్హం. రవినాయక్ కు భార్య పూజ ఇద్దరు పిల్లలున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.