నిర్మల్ జిల్లా: మహిళలపై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజూ ఏదో ఒకచోట లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గరనుంచి వృద్ధుల దాకా వయస్సుతో సంబంధం లేకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణమైన ఘటనే నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య సమస్యతో మందుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోగుల వెయిటింగ్ హాల్లోని బెంచీపై పడుకుంది. అక్కడికి ఏదో పనిమీద వచ్చిన 23 ఏళ్ల యువకుడు వృద్ధురాలి నిస్సహాయస్థితిని గమనించి మందులు ఇప్పిస్తానని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యసిబ్బంది ఎవరూ లేకపోవడం, వృద్ధురాలి అరుపులు ఎవరికి వినిపించలేదు. ఆ తర్వాత యువకుడు వృద్ధురాలి నోరు మూసాడు. అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం అక్కడి నుంచి ఆ యువకుడు పారిపోయాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో ఆసుపత్రికి వచ్చిన మరికొందరు ఆమె దగ్గరకు చేరుకున్నారు. బాధితురాలు జరిగిన విషయాన్ని వారితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని, వెంటనే రంగంలోకి దిగి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకొని అతనిపై అత్యాచార కేసు నమోదు చేసారు..