Thursday, November 19, 2026
HomeTelanganaగల్లీ రోడ్డుపై దర్జాగా పార్కింగ్.. కాలనీవాసులకు తప్పని తిప్పలు!

గల్లీ రోడ్డుపై దర్జాగా పార్కింగ్.. కాలనీవాసులకు తప్పని తిప్పలు!

పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా రోడ్డుపైనే వాహనాలు.. అధికారుల చర్యల కోసం ఎదురుచూపులు..

📰 Generate e-Paper Clip

కాలేజీ, ఆసుపత్రులకు వచ్చే వారి వాహనాలతో పార్కింగ్ అడ్డాగా మారిన గల్లీ రహదారి.

మంచిర్యాల నవంబర్ 18, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న ఓ గల్లీ రహదారి పార్కింగ్ అడ్డాగా మారింది. గల్లీకి ఒకవైపు కళాశాల, మరోవైపు ఆసుపత్రి ఉండటంతో ఆయా ప్రాంతాలకు వచ్చే వారు తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీంతో అసలే ఇరుకుగా ఉండే రహదారి మరింత కుదించుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ గల్లీ నుంచి కొంత ముందుకు వెళ్తే పలు ఆసుపత్రులతో పాటు ఓ కాలనీ ఉంది. గల్లీ ప్రారంభంలోనే ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో కాలనీలోకి వెళ్లే ప్రజలు, ఆటోలు, ఆసుపత్రులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే దారి ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోతోంది. కాలనీవాసులు తమ ఇళ్లకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా వాహనాల మధ్య నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పార్కింగ్ సౌకర్యం ఏదీ? పేరుకు మాత్రమే నిర్ణీత పార్కింగ్ స్థలం కేటాయించినప్పటికీ, వాస్తవంగా ఆసుపత్రికి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలిపివేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అటు కళాశాలకు వచ్చే వారి వాహనాలు సైతం ఇదే గల్లీ రోడ్డుపై నిలుపుతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. సంబంధిత యాజమాన్యాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చూడాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించవద్దని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నిలిపే వారిపై జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గల్లీ రహదారిపై పార్కింగ్‌ను పూర్తిగా అరికట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.