రామగుండం సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషలో సామాజిక అంశాలను తన రచనల ద్వారా ప్రజలకు చేరువ చేసి చైతన్యం కలిగించిన మహోన్నత ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. కాళోజీ కేవలం కవి మాత్రమే కాకుండా సామాన్యుల సమస్యలను తన కలం ద్వారా బలంగా వినిపించిన ప్రజా గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు. సామాజిక అన్యాయం, అసమానతలు, దోపిడీ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని కాళోజీ తన రచనల ద్వారా కలిగించారని తెలిపారు. ఆయన రచనల్లోని ప్రజా చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా వినడం, బాధితులకు న్యాయం చేయడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడమే కాళోజీకి నిజమైన నివాళి అని సీపీ పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రశ్నించిన కాళోజీ కలం స్ఫూర్తిగా, ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీస్ యూనిఫామ్ ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత చేరువగా, బాధ్యతాయుతంగా, మానవీయ దృక్పథంతో పోలీసింగ్ అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏవో శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేశ్, శ్రీనివాస్, ఆర్ఐలు శేఖర్, రమేష్, సీసీ సందీప్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్, శివ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
