మంచిర్యాల, సెప్టెంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ )
రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని త్వరగా మర ఆడించి, నిర్దేశిత బియ్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం భీమారం మండలం అంకుశాపూర్‌లోని సమతా రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మద్దికల్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన కలెక్టర్.. తడి, పొడి చెత్తను ప్రతిరోజూ సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లకే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. రైతులతో మాట్లాడి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరేపల్లి పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్య, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఆరో తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. భవిత కేంద్రాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో వీణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
