
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నిజాం కాలం నాటి టెనెన్సీ భూములకు సంబంధించిన భారీ స్కామ్ బయటపడింది. 1954కు ముందు నిజాం పాలనలో గ్రామ అధికారుల పేర్లపై నమోదు అయిన భూములను రైతులకు ఇచ్చి కౌలు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వం రక్షిత కౌలు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు హక్కులు కల్పించింది. అయితే, ప్రస్తుతం అప్పటి గ్రామ అధికారుల వారసులు కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో మార్పులు చేసి దాదాపు 50 వేల ఎకరాల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతు సంఘాలు ఈ స్కామ్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి భూముల అసలు హక్కుదారులను గుర్తించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

