Monday, August 17, 2026
HomeTelanganaప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుందారంలో నిపుణుల సేవలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ వినోద్ కిష్టయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ, వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్, దంత వైద్యులు, కంటి నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులు పాల్గొని గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నిపుణుల వైద్య సేవలు అందించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా జాతీయ టీకాల దినోత్సవం సందర్భంగా తల్లులు, గ్రామస్తులకు టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పిల్లలకు సమయానికి టీకాలు వేయించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్పీవీ టీకా వేయించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని వివరించారు. అలాగే అసంక్రమణ వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి సమస్యల నివారణకు సమయానికి పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు తీసుకోవడం, ఆరోగ్యకర జీవనశైలిని పాటించడం అవసరమని సూచించారు. మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ సహకారంతో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. యోగా, వ్యాయామం వంటి అలవాట్లు పాటించడం ద్వారా జీవనశైలి సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్ పద్మ, శ్రీనివాస్, రాంబాబు, రాజమణి, ఉపకేంద్ర సిబ్బంది, ఆయుష్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.