40 ఏళ్లుగా నివాసం… అయినా పట్టాలు లేవంటూ ఆవేదన

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని కగజ్నగర్ మండలం, కొసిని గ్రామ పంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కే హరిత కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, తాము దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదలమని తెలిపారు. గ్రామం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్న ఇళ్లు, గుడిసెలు వేసుకుని కొందరు గత 40 ఏళ్లుగా, మరికొందరు 30 ఏళ్లుగా, ఇంకొందరు 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని వివరించారు. ఇటీవల వెంకటనారాయణ అనే వ్యక్తి తమ ఇళ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్నప్పటికీ తమకు ఇప్పటివరకు అధికారికంగా ఇంటి పట్టాలు అందలేదని వాపోయారు. ఇంటి పట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలు మరియు ఇతర సంక్షేమ సదుపాయాలు పొందలేకపోతున్నామని తెలిపారు. కాబట్టి కలెక్టర్ చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో సర్వే నిర్వహింపజేసి, తాము నివసిస్తున్న స్థలాలకు ‘ఇళ్ల పట్టాలు’ మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లా అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

