Tuesday, August 18, 2026
HomeTelanganaస్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలోని రాజేశ్వరరావుపల్లె గ్రామంలో మండల ప్రత్యేక అధికారి ఎన్.యాదయ్యతో కలిసి పర్యటించి స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత అవసరమని, వర్షాకాలంలో సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించవచ్చని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా అంతర్గత రహదారులు, మురుగు కాలువలతో పాటు నివాస ప్రాంతాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దోమల వృద్ధిని అరికట్టేందుకు నీరు నిల్వ లేకుండా తొలగింపు చర్యలు, అయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు మెను ప్రకారం సకాలంలో పోషకాహారం అందించాలని, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పడనపల్లిలోని ఆదర్శ పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తీరును తరగతి గదిలో కూర్చొని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు తరగతి గదులు ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఉపాధ్యాయులు విధులలో సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యాబోధన చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రి వార్డులు, ఫార్మసీ, ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. వర్షాకాలం అయినందున అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు, విషజ్వరాల నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందించడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గుడిపేట గ్రామంలోని నర్సరీని సందర్శించి వన మహోత్సవం కార్యక్రమంలో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని, మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాన్రెడ్డి, ఎ.పి.ఓ. మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.