Tuesday, August 18, 2026
HomeTelanganaఉద్యోగాల భర్తీలో అవకతవకలు.

ఉద్యోగాల భర్తీలో అవకతవకలు.

📰 Generate e-Paper Clip

పైసలు పెట్టు.. ఉద్యోగం పట్టు!

వైద్యకళాశాల తాత్కాలిక ఉద్యోగాల భర్తీలో అవకతవకలు..

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పొరుగుసేవల ఉద్యోగ నియామకాల్లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రకటన ఇచ్చే వరకే పారదర్శకంగా ఉంటుండగా, ఎంపిక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా మారుతోంది. వేలాది మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో నుంచి అధికంగా డబ్బులు ఇచ్చే అభ్యర్థులు, ఇతర జిల్లాల వారిని సంప్రదించిన గుత్తేదారులు రూ. లక్షల్లో వసూలు చేసి, తాత్కాలిక ఉద్యోగాలను ఇచ్చేస్తున్నారు. అర్హులైన నిరుద్యోగులు తమ బాధను అధికారులకు మొరపెట్టుకున్నా కనీస స్పందన ఉండటం లేదు. రాజకీయ నేతల సిఫార్సులు, అడిగినంత ఇచ్చిన వారికే ఇవి దక్కుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 32 పొరుగు సేవల ఉద్యోగాల కోసం ఏజెన్సీ నిర్వాహకుడు గత సంవత్సరం సెప్టెంబరులో ఒక ప్రకటన ఇచ్చారు. 5 నెలలు గడచిన అనంతరం ఇటీవలే పూర్తి స్థాయిలో నియామకాలు జరిగాయి. కుమురం భీం జిల్లా మినహా ఇతర జిల్లా అభ్యర్థులను తీసుకోవద్దనే నిబంధనలు ఉన్నాయి. వీటికి తిలోదకాలు ఇచ్చి మంచిర్యాల, బెల్లంపల్లి, కాసిపేట ప్రాంతాల వ్యక్తులకు పదుల సంఖ్యలో ఉద్యోగాలు కట్టబెట్టారనే ప్రచారం సాగుతోంది. అభ్యర్థులను చరవాణిలో సంప్రదించి రూ. లక్ష నుంచి రూ.2 లక్షలు, కొందరి నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్నారనే సమాచారం. అడిగినంత ఇవ్వకపోతే ఉద్యోగం దక్కదని నిరుద్యోగులు.. అప్పులు చేసి మరీ డబ్బులు సమర్పించుకున్నారని, పలువురు కొంత మొత్తం ఇచ్చి, ఉద్యోగం వచ్చాక పూర్తిగా ఇచ్చారని తెలిసింది.

• ఆరోపణల వెల్లువ..

ఆసిఫాబాద్, కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల వరకు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పొరుగు సేవల ఉద్యోగాలు పొందిన వారికి మూడు నెలల్లోపు వేతనాలు అందాల్సి ఉండగా.. ఏజెన్సీ నిర్వాహకులు ఎక్కడా నిబంధనలను పాటించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 19 ఏజెన్సీలు ఉండగా.. దాదాపు 250 మంది ఒప్పంద ప్రతిపాదికన <span;>పనిచేస్తున్నారు. అవసరమైన వారికంటే తక్కువ మందిని నియమించి, పూర్తి స్థాయిలో నియమించినట్లుగా వేతనాలు సంబంధిత గుత్తేదారు కాజేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వ్యక్తుల జాబితా పరిశీలిస్తే ఈ అక్రమాలు బయటపడనున్నాయి.

• నేతలకు అనుకూలంగా..

ఉద్యోగ ప్రకటన ఇచ్చిన అనంతరం సెలక్షన్ కమిటీ ఉంటుందని, పాలనాధికారి పర్యవేక్షణ చేస్తారని ప్రకటించారు. కానీ ఇటువంటిదేమీ లేకుండానే కనీసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే, మెరిట్ జాబితా ప్రకటించకుండానే నియామకాలు చేసేశారు. మరో 280 పోస్టులను దశల వారీగా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి సైతం పైసలు ఇచ్చిన వారికే ఇస్తారా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు సేవల ఉద్యోగార్థులను సరఫరా చేసే గుత్తేదారు ఇంతమందిని అందించాలనే ప్రభుత్వ ఉత్తర్వులను సాకుగా చూపుతూ ఎంపిక ప్రక్రియ, స్థానిక, ప్రతిభ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నేతలకు అనుకూలమైన వ్యక్తులను లేదా కాసులు కుమ్మరించిన వారికే పెద్దపీట వేస్తున్నారు.

• ఇతర జిల్లాల వారికి ఇవ్వకూడదు

    – రవికృష్ణ, జిల్లా ఉపాధి కల్పనాధికారి

పొరుగు సేవల నియామకాల్లో ఇతర జిల్లాల వారికి అవకాశం ఉండదు. వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపడతాం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.