Wednesday, August 19, 2026
HomeTelanganaప్రజల సహాయార్థం అధికార యంత్రాంగం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది

ప్రజల సహాయార్థం అధికార యంత్రాంగం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది

📰 Generate e-Paper Clip

ప్రత్యేక అధికారి భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎలప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, హాజీపూర్ మండల తహశిల్దార్ రాజలింగుతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి జిల్లాలోకి వరదనీరు అధికంగా చేరుతుందని, ఈ పరిస్థితులలో ప్రజలకు సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటలు అందుబాటులో సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వరద పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులలోకి చేరుతున్న వరదనీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాబోవు 2 రోజులు వర్ష సూచన ఉన్నందున అత్యవసర స్థితి నెలకొనే అవకాశం ఉందని, అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. వర్షాకాలం, వరద పరిస్థితులలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో సంబంధిత అధికారులు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా త్రాగునీటి, తీసుకోవలసిన ఆహారపదార్థాలపై వివరించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు జిల్లాలో 12 పునరావాస కేంద్రాలతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని, ప్రజల సహాయార్ధం సమీకృత కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ నం. 08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, సేవల నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 311 గ్రామపంచాయతీలలో అధికారులు సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని, 24 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తీవ్రమైన స్థితి ఏర్పడినట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు క్రిందకి ఒరిగినా, విరిగిపోయినా, పడిపోయినా, విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నా వెంటనే సమాచారం అందించడం కోసం కంట్రోల్ రూమ్ నం. 7901628369 ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని, ఆశ, ఆరోగ్య కార్యకర్తల వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల తహశిల్దార్ పిన్న రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ కలిసి మంచిర్యాల పట్టణంలోని రాంనగర్, ఎన్.టి.ఆర్. నగర్ లోకి చేరిన వరద పరిస్థితులను పర్యవేక్షించారు. వరద నీటిలోకి ప్రజలు ఎవరు వెళ్ళకుండా బందోబస్తు చర్యలు పకడ్బంధీగా చేపట్టాలని అధికారులను అదేశించారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలో తహశిల్దార్ జ్యోతి, మున్సిపల్ కమీషనర్ రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ ప్రభాకర్ లతో కలిసి గోదావరి నది పరివాహక ప్రాంతంలో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమాలలో హాజీపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అబ్దుల్ హై, మున్సిపల్ సిబ్బంది, ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.