Thursday, July 2, 2026
HomeTelanganaపిల్లల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

పిల్లల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పిల్లల సంరక్షణ, ఎదుగుదల బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భీమా గార్డెన్ లో జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, వైద్య-ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలలో పోషకాహార లోపం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంరక్షణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం పిల్లల్లో ఎదుగుదల, ఆర్యోగ స్థితి, సంరక్షణపై ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందని తెలపారు. జిల్లాలో పిల్లల సంరక్షణ ఆయా గ్రామాల సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని, ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు పరిశీలించాలని, పిల్లలకు మంచి ఆరోగ్య స్థితి సూచిక ప్రకారం పిల్లల వయస్సు, ఎత్తుకు తగినట్టుగా ఉండవలసిన బరువు వివరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిచాలని, పిల్లల కనీస అవసరాలు తీర్చడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. తీవ్రమైన పోషణ లోపం, తక్కువ పోషణ లోపం గల బాలలను గుర్తించి పోషక ఆహార పునరావాస కేంద్రం ద్వారా తక్కువ పోషణ లోపం గల పిల్లలను 8 వారాలు, తీవ్రమైన పోషణ లోపం గల పిల్లలను 16 వారాల వ్యవధిలో సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా ప్రత్యేక కార్యచరణ రూపొందించి, దాని ప్రకారముగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చి వారికి మంచి భవిష్యత్తు అందించే విధంగా అవసరమైన పోషకారం అందించే పోషణ బాధ్యత గ్రామపంచాయతీలదేనని తెలిపారు. బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలల హక్కులను పరిరక్షించడానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు జరుగకుండా, బాలలందరు బడికి వెళ్ళే విధంగా, బాలకార్మికులు లేకుండా, బాలలపై ఎలాంటి వేధింపులు జరుగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

గ్రామాలలోని బాలలందరి జాబితా, వయస్సుల వారిగా సేకరించాలని, బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారు బడికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పిల్లలకు అందుతున్న సౌకర్యాలపై పర్యవేక్షించాలని, విద్యాధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో కలిసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివాహ నమోదు చట్టం-2002 ప్రకారం ప్రతి వివాహాన్ని నమోదు చేసి చట్టబద్దత కల్పించాలని, ఈ నమోదు ద్వారా బాల్య వివాహాలు, మోసపూరిత, రహస్య వివాహాలను అరికట్టవచ్చని, ప్రభుత్వ ఉద్యగాలు చేసే వారికి, విదేశాలకు వెళ్ళే వారికి కుటుంబ సభ్యులుగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తప్పుడు సమాచారంతో వివాహం నమోదు చేసుకునే వారికి, మోసపూరిత సమాచారం అందించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో బోదకాలు (పైలేరియా) నియంత్రణపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాల పరిధిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. దోమకాటు వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, జిల్లాలో 846 మంది బోదకాలు బాధితులు ఉన్నారని, మొత్తం 7 లక్షల 56 వేల మందికి బోదకాలు వ్యాధి నియంత్రణ మందులు పంపణీ చేయడం జరుగుతుందని, 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధి అందరి బాధ్యత అని, మొదటి విడతలో 248 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టడం జరుగుతుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద వంటశాలలు, మూత్రశాలలు, ప్రహారీగోడ, భోజనశాల, గదులు ఇతరత్రా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా గ్రామ స్థాయిలో సర్పంచ్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం బాలల పరిరక్షణ, బాల్యవివాహలు బోధకాలు వ్యాధి వ్యాప్తి నియంత్రణ సంబంధిత కరదీపికలు, గోడప్రతులను ఆవిష్కరించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి బి. శేషాద్రి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.