ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్
ఆసిఫాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతును మోసం చేస్తే దేశాన్ని మోసం చేసినట్లే అని పేర్కొన్నారు. జిల్లాలో పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని, నాసిరకం విత్తనాలు అమ్మిన, రైతును మోసం చేయాలని చూసిన సహించేది. లేదని పేర్కొన్నారు. అలాగే రైతులు నష్టపోకుండా ఉండాలంటే, వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి గ్రామంలో పోలీస్, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చిన వారి వివరాలను పోలీసు వారికి వెంటనే డయల్ 100 ద్వారా కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టిలైజర్ షాప్ ల పైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాప్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, షాపుల యజమానులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
