దిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ఘన విజయం తర్వాత యోగి ఆదిత్యనాథ్ తొలిసారి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో యూపీ ప్రజల కోసం యోగి ఎంతో కష్టపడ్డారని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో సమావేశమయ్యారు. అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తో కలవనున్నారు. లఖ్నవూ నుంచి ఇవాళే దిల్లీకి వచ్చిన ఆయన.. రెండ్రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారని సమాచారం.
ఇటీవలి ఫలితాలల్లో 403 స్థానాలకు మిత్రపక్షాలతో కలిసి భాజపా 273 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగానే దిల్లీలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారంతో పాటు, నూతన మంత్రివర్గం ఏర్పాటువంటి అంశాలను పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వారిలో కేశవ్ ప్రసాద్ మౌర్య ఎన్నికల్లో ఓటమి చవిచూడగా.. దినేశ్ శర్మ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరోవైపు ఎన్నికల్లో 10 మందికి పైగా మంత్రులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి శాసనమండలి ద్వారా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం..