Telugu Updates
Logo
Natyam ad

స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఆర్.ఎస్.ఈ.టి.ఐ.)-ఉట్నూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బాగ్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్, ఆర్.ఎస్.ఈ.టి.ఐ. సంచాలకులు మహమ్మద్ గౌస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాల ద్వారా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ఆర్.ఎస్.ఈ.టి.ఐ. -ఉట్నూర్ ఆధ్వర్యంలో 2 బాచ్లకు జూట్ బాగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జన్నారం మండలంలో నవంబర్ 26, 2024 నుండి డిసెంబర్ 8, 2024 వరకు 13 రోజుల పాటు మొదటి బ్యాచ్ లో 35 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహించిన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టూల్ కిట్లు, ధృవపత్రం అందించడం జరిగిందని తెలిపారు. 2వ బ్యాచ్ లో  లక్షెట్టిపేట మండలంలో డిసెంబర్ 30, 2024 నుండి జనవరి 11, 2025వ తేదీ వరకు 35 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తూ వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం తరుపున బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని, ఉత్పత్తులను తయారు చేసి నిర్ణీత ధరతో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జూట్ సంచుల వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రత్యామ్నాయంగా జూట్ సంచులను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జూట్ సంచుల ఉత్పత్తి ఉత్పాదకతను పెంపొందించి ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పని చేయాలని, లక్ష్యసాధన దిశగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులను తయారు చేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ జె.డి.ఎం. రాంచందర్, శిక్షకులు శ్రీనివాస్, ఆశన్న, సతీష్, స్వర్ణలత, గురువయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.