రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి లోకేష్, సెర్ఫ్ సి.ఈ.ఓ. దివ్య దేవరాజన్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు వివిధ వ్యాపార అంశాలలో మహిళలను ప్రోత్సహిస్తూ రుణ సదుపాయం కల్పించి రాయితీ అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భవిష్యత్తు కార్యచరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన విద్యుత్తు పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం కుదిరిన ఒప్పందాన్ని జిల్లాల వారీగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ఈ క్రమంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు, మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించి, అందులో ఉన్న ఇరిగేషన్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్., రెవెన్యూ భూములను అధికారులు గుర్తించాలని, ప్లాంట్ ఏర్పాటులో రుణ సదుపాయం కోసం బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మహిళా సంఘాల భూములలో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్ కో ద్వారా టెండర్లు ఆహ్వానించడం జరిగిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల గుర్తింపు, భూముల సేకరణ, బ్యాంకుల నుండి ఆర్థిక చేయూత వంటి అంశాలపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, 1 మెగా వాట్ ఉత్పత్తికి 3.5 ఎకరాల నుండి 4 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ప్రతి జిల్లాలో 100 ఎకరాల నుండి 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల 500 ఎకరాల నుండి 4 వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని తెలిపారు. దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని, కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాలలోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంట సాగు చేసుకుని అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 4 నుండి 5 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాల ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టా భూములను ఇప్పటి వరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయడం జరిగిందని, ఉపాధి హామీ, గిరిజన శాఖలు, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నింటిని సమన్వయం చేసుకొని సంబంధిత రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా రైతులు 2 మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకుని అవకాశం ఏర్పడిందని, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. టి.జి. రెడ్ కో పోర్టల్ ద్వారా రైతులు సోలార్ పవర్ ఉత్పత్తికి దరఖాస్తు చేసుకోవచ్చని, తద్వారా తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి రావడమే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కొరకు జిల్లాలో 10 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని, మిగతా భూమిని త్వరలోనే గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, రైతుల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్రాశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.