మంచిర్యాల జిల్లా: యజమానుల కళ్లు కప్పి బంగారు దుకాణాల్లో నకిలీ బంగారు వస్తువులను మార్చి బంగారు వస్తువులను దొంగిలిస్తున్న నలుగురు మహిళలను బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల ఇన్చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సంబంధిత కేసు వివరాలను గురువారం వెల్లడించారు. ఈనెల 5న బెల్లంపల్లి పట్టణంలోని వెంకటసాయి జువెల్లరీలో స్టాక్ తనిఖీ చేస్తుండగా అసలు బంగారు కమ్మల స్థానంలో నకిలీ బంగారు తొమ్మిది జతల కమ్మలు ఉన్నట్లు యజమాని కొలిపాక అరవింద్ గుర్తించాడు. అరవింద్ అదేరోజు వన్ టౌన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాపు ప్రారంభించిన ఎస్ హెచ్ వో ముప్కే రాజు దుకాణంలోని సీసీ పుటేజీలను పరిశీలించి గత నెల 28న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పుటేజీలో ఉన్న మహిళల ఫోటోల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు…
ఈ క్రమంలో గురువారం ఉదయం అనుమానస్పదంగా కాంటా చౌరస్తాలో కనిపించిన నలుగురు వ్యక్తులు ఖమ్మం జిల్లా రాయపట్నానికి చెందిన బాలసాని వెంకటరమణ అలియాస్ వెంకటరావమ్మా, బొజ్జగాని నాగేంద్రమ్మ, బొజ్జగాని దీనమ్మ, మేచర్ల రేణుకలను విచారించగా దొంగతనానికి పాల్పడింది తామనేని అంగీకరించారు. వీరు గత 15 ఏండ్లుగా పలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. బంగారు దుకాణాలకు కస్టమర్ల లాగా వెళ్లి నగలు చూపించమని అడుగుతారు. వీరి వద్ద అంతకుముందు సిద్ధంగా ఉన్న నకిలీ బంగారు వస్తువులను మార్చేసి అసలు బంగారు వస్తువులను కాజేస్తారు. అలా దొంగిలించగా వచ్చిన వస్తువులను నలుగురు సమానంగా పంచుకుంటారు. సుదూర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడితే తమను ఎవరూ గుర్తు పట్టరని బెల్లంపల్లి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గత నెల 28కు ముందు రెక్కీ నిర్వహించి అనువుగా ఉన్న వెంకటసాయి దుకాణంలో దొంగతనం చేద్దామని నిర్ధారించుకున్నారు. రెండు జట్లుగా విడిపోయిన నలుగురు మహిళలు దుకాణంలో నగలు కొనుగోలు చేస్తున్నట్లు మాటల్లో మభ్యపెట్టి అసలు నగలను దొంగిలించారు.
దొంగిలించిన నగలను విక్రయించుదామని మళ్లీ బెల్లంపల్లికి బస్ ద్వారా వచ్చారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 80వేల విలువైన తొమ్మిది జతల బంగారు కమ్మలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మహిళా దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మాచారం ఎస్సై హైమ, కానిస్టేబుళ్లు ఇందూరి మల్లేష్, సంపత్ కుమార్, మహిళా హోంగార్డ్ సౌజన్యలను డీసీపీ, ఏసీపీలు అభినందించి క్యాష్ రివార్డ్ అందించారు.