భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్..!
వివాహిత మృతి కేసులో వీడిన మిస్టరీ…
12 గంటల్లోనే చేదించిన పోలీసులు
పెద్దపల్లి జిల్లా: వివాహిత అనుమానిత మృతి కేసులో మిస్టరీ వీడింది. పెద్దపల్లి పోలీసులు 12 గంటల్లోనే మిస్టరీ నిషేధించి భార్యను హత్య చేసిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం పెద్దపల్లి ఏసిపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎసిపి సారంగపాణి కేసు వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి పట్టణంలోని ఆదర్శనగర్ లో నివాసముంటున్న బరిగేల కావ్య (23) మృతి చెందిందని స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ తో కలిసి పరిశీలించామన్నారు. కావ్య ఆత్మహత్య చేసుకున్నదని భర్త సందీప్ పోలీసులకు తెలియజేశాడని, మృతురాలి తల్లి వరకట్న వేధింపులతో తన కూతుర్ని హత్య చేశారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామన్నారు. సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి భర్త సందీప్ హత్య చేశాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఐదు సంవత్సరాల క్రితం కావ్య సందీప్ లకు వివాహం జరిగిందని, అదనపు కట్నం కోసం కావ్యను సందీప్ వేధించేవాడన్నారు. సోమవారం తెల్లవారుజామున కావ్య నిద్రిస్తున్న సమయంలో చున్నీతో ఉరివేసి ఊపిరాడకుండా చేసి సందీప్ హత్య చేశాడన్నారు. ఈ మేరకు సందీప్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.