హైదరాబాద్: “నీ కథ బాగుంది… సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి… కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం… ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.. అక్కడ నా కోర్కెలు తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా” అంటూ మహిళా కథా రచయితను బెదిరించిన సినీ నిర్మాతపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వైఖరితో భయపడిన బాధితురాలు తొలుత ‘షి’బృందానికి ఫిర్యాదు చేయగా… ఆమెను భరోసా కేంద్రానికి పిలిపించారు. డీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధితురాలితో మాట్లాడి గోల్కొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు.
ఆరునెలల క్రితం.. ఆన్లైన్ లో పరిచయం ..!
హైదరాబాద్ లో ఉంటున్న మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్లైన్లో పరిచయమయ్యాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, సంఘటనలను సినిమాలుగా తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల చిత్తు ప్రతిని ఆమె నిర్మాతకు అందజేశారు. కథను చదువుతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్ చేశాడు. కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుదని అన్నాడు. అప్పటి నుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే నీకు ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుకుంటానంటూ బెదిరించాడు. బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.