ఉక్రెయిన్ తో జరుగుతున్న పోరుపై రష్యా నుంచి సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడులకు దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 9న రష్యాకు చాలా ప్రత్యేకమైన రోజుగా విశ్లేషకులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీ సైన్యాలపై రష్యా ఆరోజున విజయం సాధించింది. 1945, మే 9న జర్మన్ సైన్యాలు రష్యాకు లొంగిపోయాయి. ఆ రోజును ‘విక్టరీ డే’గా రష్యా ఏటా నిర్వహిస్తోంది. దీంతో ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని ఉక్రెయిన్ పై విజయం సాధించేందుకు రష్యా భారీగా రిజర్వ్ దళాలను దింపే అవకాశం ఉందని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మరో వైపు పౌరులను కూడా యుద్ధంలోకి రావాలని రష్యా ఆహ్వానించే అవకాశాలున్నాయని అమెరికా, బ్రిటన్ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిని కేవలం సైనిక చర్యగా మాత్రమే రష్యా చెబుతోంది. ఒక వేళ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే ఉక్రెయిన్పై మరింత తీవ్రంగా, భారీ దాడులు చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ తో జరిగే పోరును నాజీలపై జరిగే యుద్ధంగా రష్యా అధినేత పుతిన్ చెప్పొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సోమవారం పుతిన్ దీనిపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు పుతిన్ ప్రసంగంపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..