Telugu Updates
Logo
Natyam ad

వ్యాక్సిన్ తప్పనిసరి… డీహెచ్ శ్రీనివాస్

హైదరాబాద్: కొవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయజాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. “తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదు. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదు. గత ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉంది. కొన్ని చోట్ల ఫోర్త్ వేవ్ ప్రారంభమైంది. థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. సీఎం గత నాలుగు రోజులుగా కొవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ ఎక్స్ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా పూ లా మారే అవకాశం ఉంది.

థర్డ్ వేవ్, వస్తుందో రాదో తెలియని ఫోర్త్ వేవ్ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో 106శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చాం. రెండో డోసు కూడా వంద శాతం మంది వేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల అప్రమత్తత కారణంగా థర్డ్ వేవ్లో తక్కున నష్టంతో బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. 60 ఏళ్ల పైబడిన వారికి అన్ని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇస్తున్నాం. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలి” అని డీహెచ్ వివరించారు..