విమాన తయారీ కర్మాగారంపై రష్యా దాడి..!
ఆంజనేయులు న్యూస్: రష్యా దళాలు కీవ్ లో భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. కీవ్ ఉత్తర శివార్లలో యాంటోనోవ్ విమానాల తయారీ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకొన్నాయి. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని యాంటినోవ్ ఎయిర్ ఫీల్డ్ వద్ద ఈ కర్మాగారం ఉంది. కర్మాగారం సమీపం నుంచి భారీగా పొగ వెలువడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా దళాల శతఘ్ని దాడుల కారణంగా మంటలు వ్యాపించినట్లు నిపుణులు భావిస్తున్నారు. భారీ భవనాలు, ప్లాంట్ల లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇక్కడి నుంచి 70 మందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రష్యా సేనలు కీవ్ వైపు వెళ్లే వంతెన మార్గాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల రష్యా సేనలు ఉక్రెయిన్ పై దాడి మొదలు పెట్టిన తొలిరోజే ప్రపంచంలోనే అతి పెద్ద విమానమైన యాంటినోవ్ 225 పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ ఘటన హోస్టోమెల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకొంది. ఈ ఎయిర్ పోర్టు కీవ్ లో అత్యంత కీలకమైంది. ఇది వైమానిక దళ స్థావరం కూడా. రష్యా ఇప్పటికే కీలక కర్మాగారాలు, విద్యుత్తు కేంద్రాలపై దాడులు చేస్తోంది. అణు విద్యుత్తు కేంద్రమైన జపోర్జియాపై దాడి చేసింది. ఇక్కడ దాదాపు 5. 5 వేల మెగావాట్లకు పైగా విద్యుత్తు తయారవుతుంది. కానీ ఈ అణుకేంద్రంలో ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఉక్రెయిన్ వాసులు ఊపిరి పీల్చుకొన్నారు..