టీ.ఎస్.పీ.ఎస్.సీ, కార్యాలయం ముట్టడికి యత్నం.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత..?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీ ఎస్ సీ) ముట్టడికి ఎన్.ఎస్.యు.ఐ, పిలుపునిచ్చింది. ఇదే డిమాండ్ తో ఎన్.ఎస్.యు.ఐ, కార్యకర్తలు ముందుగా గాంధీభవన్ లో సమావేశం కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు గాంధీభవన్ వద్ద భారీగా మోహరించారు. గాంధీభవన్ నుంచి టీఎస్ పీ ఎస్ సీ, కార్యాలయ ముట్టడికి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని… వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని… అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్ఎస్ఎయూఐ నాయకులు హెచ్చరించారు..