Telugu Updates
Logo
Natyam ad

ఆ ఘటనలు ఎంతో బాధించాయి.?: చిరంజీవి

గవర్నర్ తమిళిసై తో కలిసి రక్తదాతలకు ‘చిరు భద్రత కార్డుల పంపిణీ

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. తాను హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశానని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి రాజభవన్ లో గవర్నర్ చేతుల మీదుగా ‘చిరు భద్రత పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు.. రక్తదానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవ చేస్తున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవికి ఆమె అభినందనలు తెలిపారు. రాజభవన్ తరపునా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని.. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్ ను రూపొందించామన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని తమిళసై కోరారు.

అనంతరం చిరంజీవి మాట్లాడారు..1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని.. ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి అన్నారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని.. వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించామని చెప్పారు. తరచూ 2-3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఏదైనా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో ఆస్పత్రి కట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని ఇప్పటి వరకు సేకరించామని.. దీనిలో 70 శాతం పేదలకు, మిగిలినది ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేశామని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందన్నారు. రక్తదానం చేసేవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.