రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దేశం కోసం రాష్ట్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్రశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ లతో కలిసి హాజరై గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ.. మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని, అమరవీరులు చేసిన పోరాటాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, మహానుభావుల అందించిన స్ఫూర్తి సదా స్మరణీయమని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం అధికార యంత్రాంగంతో కలిసి నిరంతరం పని చేస్తుందని అన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతితో కలిసి ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.