ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలి
కెసిఆర్ పెట్టిన పథకాలను రేవంత్ సర్కార్ కొనసాగించాలి
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, ప్రభుత్వం మొద్దు నిద్రవీడి మంచి పాలన కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో గతంలో నీలాభాయి పైన జరిగిన అత్యాచారయత్నం దాడి సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ,గత నెలలో వాంకిడి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ అస్వస్థతకు గురై మృతి చెందిన శైలజ కుటుంబ సభ్యులను వారి సంతగ్రామమైన దాబాకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ చౌక్ లో కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మోటార్ సైకిల్ ర్యాలీతో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇంటి వద్దకు చేరుకుని ఇక్కడఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు..
తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత సీఎం చంద్రశేఖర రావు ఆసిఫాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల రావడం గర్వించదగ్గ విషయమని మెడికల్ కళాశాల జిల్లాకు రావాలని కెసిఆర్ ఎంతో పట్టుబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారని, ఎస్సీ ఎస్టీ గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు, మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎస్టి గురుకులాల్లో మహిళా డిగ్రీ కళాశాలను సైతం ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వంది అన్నారు. ఈ ప్రభుత్వo గత పాలకులు ఏర్పాటు చేసిన పథకాలను ప్రజల అవసరాల కోసం కొనసాగించాలి తప్ప మధ్యలో ఆపేయకూడదని అలా చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయిఅన్నారు. గతేడాది కొమురమ్ భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు హృదయ విధాకర సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం అన్నారు. జై నూరు లో నీలాబాయి అనే మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడి అతి దారుణంగా దాడికి దిగడం బాధాకరమన్నారు. ఇంత జరిగినా ఇక్కడ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా బాధ్యతగా వ్యవహరించక పరిస్థితిని అదుపు చేయకపోవడంతో పెద్ద ఎత్తున హింస జరిగిందన్నారు. ఇక్కడ జరిగిన హింసలో అన్ని వర్గాలకు చెందిన వారికి నష్టం జరిగిందని, ఇక్కడ కాలిపోయిన దుకాణాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని ప్రభుత్వం మొద్దు నిద్ర ఇంత ఎందుకు పోతుందో ఆలోచన చేయాలని అన్నారు. జై నూరులో మైనార్టీలకు చాలా నష్టం జరిగిందని వారికి తమ మద్దతు సానుభూతి ఎప్పటికీ ఉంటుందన్నారు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు అదేవిధంగా ఇదే జిల్లాలోని వాంకిడి మండలంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శైలజ తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరగా తాను వెళ్లి పరామర్శించడం జరిగిందన్నారు. విషతుల్యమైన ఆహారం పెట్టడంతో 32 మంది విద్యార్తినులు అస్వస్థతకు గురైతే పరిస్థితి చేయి దాటిపోయి శైలజ మృతి చెందిందని అయినప్పటికీ ప్రభుత్వం సోయి లేకుండా విద్యార్థినుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం కానీ , సహాయం చేయడం కానీ చేయలేకపోయిందన్నారు. తాము ఆసుపత్రిలో భారీత కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతోనే హుటాహుటిన వారి నాయకులను వాంకిడి మండలానికి పంపించి తాము నష్టపరిహారం ఇస్తామని, మృతురాలు తండ్రికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటివరకు అది దిక్కులేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో 57 మంది విద్యార్తినులు మృతి చెందడం జరిగిందని వారందరి విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. సమగ్ర సర్వ శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని గత 20 రోజులకు పైగా ధర్నాలు చేస్తున్నారని ఆనాడు సీఎం రేవంత్ చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారని ఆ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. కేజీబీవీ పాఠశాలల్లో ,మహిళా వసతి గృహాలలో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రవెల్లిలో అన్యాయంగా ఆదివాసీలను పొట్టన పెట్టుకుంది అని కానీ కెసిఆర్ పాలనలో ఆదివాసీలకు అటు ఇటు హక్కు పత్రాలను కల్పించడం జరిగిందని, కానీ ఈ ప్రభుత్వం ఆదివాసీలపై శీతకన్ను వేస్తుందిఅని ఆదివాసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, ఆదిలాబాద్ జిల్లా చైర్ పర్సన్ రాథోడ్ జనార్ధన్, తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం (టీబీజీకే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఆసిఫాబాద్ సహకార సంఘం చైర్మన్ అలిబిన్ అహ్మద్, వాంకిడి మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..