ఆ వార్తలు నమ్మొద్దు.. నీట్ పీజీ పరీక్ష వాయిదా లేదు
దిల్లీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్ పీజీ ప్రవేశ 2022 పై ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేశారంటూ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో ఓ నకిలీ సర్క్యులర్ బయటికొచ్చింది. ఇది వైరల్ అవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.
నిజానికి ఈ పరీక్ష ఈ ఏడాది మార్చి 12వ తేదీనే జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల దృష్ట్యా మే 21వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేయాలంటూ గత కొన్నిరోజులుగా విద్యార్థుల నుంచి అభ్యర్ధనలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదాకు సంబంధించి ఓ సర్క్యులర్ తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 28వ తేదీన నేషన్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో ఉన్న ఆ సర్క్యులర్ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఉంది. ఇది కాస్తా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ దీనిపై ఫ్యాక్ట్చైక్ చేసింది. ఆ సర్క్యులర్ నకిలీదని, దాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్లో వెల్లడించింది. నీట్ పీజీ పరీక్షలో మార్పేమీ లేదని, మే 21వ తేదీనే జరుగుతుందని పేర్కొంది..