హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు..
సిద్దిపేట ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..
టెన్త్ ఫలితాల వివరాలను మంత్రి సబిత వెల్లడించారు. “ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురులో 87.61 శాతం, బాలికల్లో 92.45 శాతం పాస్ అయ్యారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. 3,007 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదవగా.. 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. ఫలితాల్లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలవగా.. నిర్మల్ రెండు, సంగారెడ్డి మూడో స్థానంలో ఉన్నాయి. చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది..
ఉపాధ్యాయుల చొరవను అభినందిస్తున్నాం.
కరోనా సమయంలో విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థుల పట్ల అధికారులు, ఉపాధ్యాయులు చూపిన చొరవను అభినందిస్తున్నాం. దూరదర్శన్, టీశాట్ ద్వారా బోధన చేశారు. ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులు, వర్క్ షీట్ ఏర్పాటు తదితర చర్యలతో పాటు ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఒత్తిడిఇకి గురికాకుండా మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం.
అవసరమైతే రాసిన పేపర్ల జిరాక్స్ ఇస్తాం..
ఫెయిలైన విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం ఉంటుంది. అవసరమైతే విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ ఇస్తాం. ఫెయిలైన విద్యార్థులకు వారానికి రెండుసార్లు అయినా ప్రత్యేక తరగతులు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇస్తాం. ఉపాధ్యాయులు దీన్ని భారం అని కాకుండా బాధ్యతగా భావించాలి.” అని సబిత అన్నారు.
• పరీక్షలకు హాజరైన విద్యార్థులు : 5,03,579
• ఉత్తీర్ణత సాధించినవారు : 4,53,201
• ఉత్తీర్ణత శాతం : 90%
• పరీక్షలకు హాజరైన బాలురు: 2,55,438
• బాలురలో ఉత్తీర్ణత సాధించినవారు : 2,22,799
• బాలుర ఉత్తీర్ణత శాతం : 87.61%
• పరీక్షలకు హాజరైన బాలికలు: 2,48,146
• బాలికల్లో ఉత్తీర్ణత సాధించినవారు : 2,29,422
• బాలికల ఉత్తీర్ణత శాతం : 92.45%